మెట్లపై అదమరించి నడిస్తే ప్రాణాలు గాలిలోకి కలుస్తాయి. అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకొంది. బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ బ్రిగేడ్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఊహించని సంఘటన జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్‌లో రెండో అంతస్తులోని కిటికీలోంచి ఇద్దరు బీకామ్ విద్యార్థులు పడిపోయారు. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఫ్రెండ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన అమ్మాయిని ఫ్రేజర్ టౌన్‌కు చెందిన లియాగా, ఆమె ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రిస్ పీటర్‌గా పోలీసులు గుర్తించారు.
లియా, క్రిస్ పీటర్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుకుంటున్నారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు జరిగినట్టు కబ్బన్ పార్క్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. లియా, పీటర్‌లు జ్యూస్ తాగడానికి కాంప్లెక్స్‌లోకి వెళ్తుండగా మెట్లపై బ్యాలెన్స్ తప్పి.. రెండో అంతస్తులోని కిటికీ నుంచి పడిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. ఆ కిటికీకి ఎటువంటి ఇనుప గ్రిల్స్ లేవు. కేవలం గ్లాస్, ఫైబర్ షీట్‌తో రూపొందించినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇద్దరు కిటికీలోంచి పడిపోయిన వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమ్మాయి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని డీసీపీ ఎస్‌డీ శరణప్ప తెలిపారు. అయితే పడిపోతున్న లియాను కాపాడ్డానికి క్రిస్ పీటర్ ప్రయత్నించాడని, ఆ క్రమంలో తన బ్యాలెన్స్ కోల్పోయి తను నేలపై పడిపోయాడని పోలీసులు చెప్పారు. క్రిస్ ప్రస్తుతం గాయాలతో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.