అతివేగం ప్రమాదకరం అని తెలియజేసే ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. వేగం ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలను హరించేసింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. జోగియా కొత్వాలి ప్రాంతంలోని నౌగర్ బన్నీ రోడ్డులో ఉన్న కాత్యా గ్రామ సమీపంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును... బొలేరో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కారు పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.
చాలా వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొనగానే బొలెరో ఎగిరిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. ట్రక్కును ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే జోగియా కొత్వాలి పోలీసులకు తెలియజేశారు. ఆ వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, గ్రామస్థులు ఎలాగోలా అందరినీ బయటకు తీశారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం జరిగే సమయంలో బొలెరోలో మొత్తం 11 మంది ఉండగా.. వారిలో ఇద్దరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఒకరిని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయగా.. గాయపడిన వారిలో ఒకరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో మృతుల ఇంట్లో గందరగోళం నెలకొంది.
దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000లు అని పీఎంవో తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.