సొమ్ము ఒకరిది అయితే సోకు మరొకరిది అని పెద్దలు అంటుంటారు. ఇదే సూత్రం ఓ పోస్టుమాస్టర్‌కు వర్తిస్తుంది. ప్రజలు పోస్టాఫీసు పొదుపు ఖాతాల్లో దాచుకున్న మొత్తం రూ.కోటి నగదును ఇష్టానుసారంగా వాడేశాడు. క్రికెట్ బెట్టింగ్‌లో ఆ సొమ్మంతా పోగొట్టేశాడు. ఎట్టకేలకు అతడి ఘరానా మోసం బయటకు రావడంతో బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినా సబ్ పోస్ట్ ఆఫీస్‌లో సుమారు 24 కుటుంబాలకు చెందిన వారు డబ్బును దాచుకున్నారు. వారి సొమ్ముపై అదే పోస్టాఫీసులో పని చేస్తున్న విశాల్ అహిర్‌వార్ అనే పోస్ట్‌మాస్టర్ కన్ను పడింది. అసలే ఐపీఎల్ సీజన్ కావడంతో బెట్టింగ్ కోసం ఆ నిధులను ఉపయోగించాలని అనుకున్నాడు. పోస్టాఫీసులో డబ్బు దాచుకుందామని వచ్చిన వారికి నకిలీ పాస్ బుక్ జారీ చేసే వాడు. అలా రెండేళ్ల కాలంలో రూ.కోటి వరకు నగదు కొట్టేశాడు. దానిని ఐపీఎల్ బెట్టింగ్‌లో పెట్టి, కోల్పోయాడు. ఇతడి మోసాలు వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. మే 20న అతడిని అరెస్టు చేశారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. అతడు బెట్టింగ్‌లో పోగొట్టుకున్నదంతా ప్రజల డబ్బు అని తెలుసుకుని అవాక్కయ్యారు. మరోవైపు తమనకు జారీ చేసినవి నకిలీ ఖాతా పుస్తకాలు అని తెలయడంతో బాధిత ప్రజలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.