గోధుమ ఎగుమతులపై నిషేధాన్ని పునఃపరిశీలించాలని భారతదేశాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా మంగళవారం అభ్యర్థించారు, అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో దేశం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇటీవల దేశంలో గోధుమల రేట్లు పెరగకుండా ఉండేందుకు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపైనే ఆమె స్పందించారు. దాదాపు 1.35 బిలియన్ల ప్రజలకు భారత్ నుంచి ఆహారం అందుతోందని ఆమె అన్నారు. అయితే గోధుమలు ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించాలని భారతదేశాన్ని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు భారత్ కలిసి రావాలని కోరారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కారణంగా గోధుమలు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడిందని క్రిస్టాలినా అన్నారు. గోధుమలను అధికంగా ఎగుమతి చేసే భారత్ ప్రస్తుతం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిందన్నారు. దీంతో ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలలో ఆకలి కేకలు, ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదముందన్నారు. అంతేకాకుండా సామాజిక అశాంతి, ప్రపంచ స్థిరత్వంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.