అగ్ని పర్వతాలు బద్దలైనపుడు దీని కారణంగా భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ పొర నాశనమవుతుందని పేర్కొంది. దీనివల్ల భూమికి ప్రమాదం వాటిల్లే ప్రమాదముంబదని తేలింది. అమెరికా పసిఫిక్ వాయువ్య ప్రాంతంలో 15- 17 మిలియన్ సంవత్సరాల కిందట సంభవించిన కొలంబియా రివర్ బసాల్ట్ (సీఆర్బీ) విస్ఫోటనంపై సుదీర్ఘంగా నాలుగేళ్లు అధ్యయనానికి నాసా బృందం గొడ్దార్డ్ ఎర్త్ అబ్జర్వింగ్ సిస్టమ్ కెమిస్ట్రీ క్లైమేట్ మోడల్‌ను ఉపయోగించింది. ఈ పరిశోధనలో భాగంగా వందల ఏళ్ల నాటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి ఈ విషయాలను వెల్లడించారు. సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకర అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, అగ్నిపర్వతాల విస్ఫోటన సమయంలో దాని నుంచి విడుదలయ్యే బూడిద, పొగ ద్వారా ప్రమాదకరమైన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తుందని, దాని వల్ల ఓజోన్ పొరకు భారీగా దెబ్బతింటోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో పసిఫిక్ దీవుల్లో టోంగా- హూంగా హా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు.. దాని ప్రకంపనలు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేయగా.. దానిని నుంచి చిమ్మిన బూడిద చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తింది. అంతేకాదు, హిరోషిమాపై అమెరికా జారవిడిచిన అణు బాంబు కంటే 100 రెట్లు భారీ శక్తిని ఇది విడుదల చేసినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, అగ్నిపర్వతాలు ఈస్థాయిలో బద్దలైనప్పుడు భూమిపై తీవ్ర ప్రభావమే పడుతుందని, పెను ముప్పు వాటిల్లుతుందని తాజాగా నాసా శాస్త్రవేత్తలు ఈ హెచ్చరిక చేశారు.
వాతావరణంలోకి సల్ఫర్ డయాక్సైడ్ విడుదలైనప్పుడు తొలుత తుంపర్లుగా మారుతాయని, ఆ క్రమంలో సూర్యుడి నుంచి వచ్చే వేడిని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అప్పుడు కొంతకాలం పాటు వాతావరణం చల్లబడుతుందని, కానీ, పరారుణ కాంతిని బాగా శోషించుకున్న తర్వాత వాతావరణం మరింత వేడెక్కుతుందని వివరించారు. దాంతో ఆ ప్రాంతంలో నీటి ఆవిరి 10 వేల శాతం పెరుగుతుందని, దీని వల్ల ఓజోన్ పొరకు పెద్ద రంధ్రం పడుతుందని పేర్కొన్నారు.
ఫ్లడ్ బసాల్ట్స్ (ఏళ్లతరబడి అగ్నిపర్వతాలు బద్దలై లావా, పొగ విడుదల కావడం) వల్ల కార్బన్ డయాక్సైడ్ కూడా విడుదలవుతుంది. అయితే, దాని వల్ల అంతగా వేడి వెలువడదని, ఓజోన్‌పై పెద్దగా ప్రభావం ఉండదని తమ పరిశోధనలో వెల్లడైనట్టు తెలిపారు. అంగారకుడు, శుక్ర గ్రహంపైనా ఇలాంటి పరిణామాలే జరిగాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాలు వాతావరణాన్ని చల్లబరుస్తాయని సూచించే గతంలో అధ్యయనాలకు ఇది విరుద్ధంగా ఉంది. అంగారక, శుక్ర గ్రహాలపై విస్తృత వరద-బసాల్ట్ విస్ఫోటనాలు వాతావరణాలను వేడెక్కించడంలో సహాయపడినప్పటికీ, ఈ ప్రపంచంలో నీటి కొరత, దీర్ఘకాలిక నివాసయోగ్యతను నాశనం చేయగలవని ఇది సూచిస్తుంది.
‘మేము మా పరిశోధనలో తీవ్రమైన శీతలీకరణను ఆశించాం.. అయితే, వార్మింగ్ ప్రభావంతో చల్లదనం హరించుకుపోయిందని కనుగొన్నాం’ నాసా గొడ్డార్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త స్కాట్ గ్యుజెవిచ్ అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను జియోఫిజికల్ రిసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించారు. ఓజోన్ నష్టం ఆశ్చర్యం కలిగించనప్పటికీ ఇదే సమయంలో విధ్వంసం సంభావ్యతను సూచించింది. ‘అంటార్కిటికాలో ఏర్పడిన ఓజోన్ రంధ్రంతో పోల్చితే మొత్తం ప్రపంచ సగటులో మూడింట రెండొంతుల మేర కుచించుకుపోతోంది’ అని తెలిపారు.