భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. వీటిలో కొన్ని రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలా ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్న రాష్ట్రంలో కర్ణాటక తొలి స్థానంలో నిలవగా తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఇక ఏపీ ఎంతో వెనకబడింది. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకూ ఒక ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో మనదేశానికి 81.97 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. గత 20 ఏళ్లుగా భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. ఈ 20 ఏళ్లలో మనదేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 20 రెట్లు పెరగడం గమనార్హం.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలను ఎక్కువగా ఆకర్షించిన రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు టాప్-5లో నిలుస్తుండగా.. తర్వాతి స్థానంలో హర్యానా ఉంది. రూ.11 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణ (Telangana) ఏడో స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో వెనుకబడింది. ఏపీకి కేవలం రూ.1681 కోట్ల ఎఫ్‌డీఐలు మాత్రమే వచ్చాయి. ఏపీ టాప్-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.
మన దేశానికి వస్తోన్న ఎఫ్‌డీఐల్లో దాదాపు 25 శాతం వాటా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ రంగందే కావడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో 12 శాతం చొప్పున సేవా రంగం, ఆటోమొబైల్ రంగం ఉన్నాయి. అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్, మారిషస్ దేశాల నుంచే ఎక్కువగా ఎఫ్‌డీఐలు వస్తున్నాయి.
కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ రంగంలోకి వస్తోన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏకంగా 53 శాతం కర్ణాటకకు వెళ్తుండగా.. ఢిల్లీ, మహారాష్ట్రల వాటా చెరో 17 శాతంగా ఉంది.
స్థూలంగా చూస్తే దేశంలోకి వస్తోన్న ఎఫ్‌డీఐల్లో 38 శాతం ఇన్‌ఫ్లో ఒక్క కర్ణాటకకే ఉండటం గమనార్హం. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26 శాతం), ఢిల్లీ (14 శాతం) ఉన్నాయి. అంటే మన దేశానికి వస్తోన్న ఎఫ్‌డీఐల్లో ఈ మూడు రాష్ట్రాల వాటానే దాదాపు 78 శాతం. కర్ణాటకకు గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఎఫ్‌డీఐలను శాతాల వారీగా చూస్తే.. 35 శాతం కంపూట్యర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ రంగానికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి 20 శాతం, విద్యారంగానికి 12 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి.