టమాటో ఫీవర్ వ్యాధి సోకిన పిల్లల్లో శరీరంపై దద్దుర్లు, ఎర్రటి బొబ్బలు వస్తుంటాయి. అందుకే దీనిని టమాటో ఫ్లూ అని పేరు వచ్చింది. శరీరంపై దద్దుర్లుతోపాటు దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఈ వ్యాధి వైరల్ ఫీవరా..? కాదా..? అనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ వ్యాధి సోకిందనే అనుమానంతో ఒడిశాలో 36 మందికి పరీక్షించగా 26 మందికి నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వీరిలో ఒకటి నుంచి 9 ఏళ్లు మధ్య వయస్సు పిల్లలే ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 19 మంది భువనేశ్వర్‌కు చెందినవారు, ముగ్గురు పూరీకి, ఇద్దరు కటక్ చెందిన వారు ఇతరు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరందరికి భువనేశ్వర్‌లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో టెస్ట్‌లు చేశారు.
వారిని ఐదు నుంచి ఏడు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. అయితే చిన్నారుల పరిస్థితి విషమంగా లేదని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంటువ్యాధి ప్రాణాంతకం కాదని వివరించారు. కాగా ఈ నెల మొదట్లోనే కేరళలోని కొల్లం జిల్లాలోనూ 80 మంది చిన్నారులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశాయి.