అమడగూరు మండల పరిధిలోని హరిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బుధవారం సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దలు, చిన్నలు అందరూ తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ఆలయం వద్దకు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా వేద పండితులు నాగేంద్ర శర్మ, రఘునాథ, అనీల్ ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతామూర్తుల ప్రతిబింబమలు, ప్రాణ ప్రతిష్ట, జీవ కళాన్యాస, నేత్రోన్మీలన, నిరీక్షణ, కుష్మాండ నారి కేళచ్చేదనమలు, గోదర్శన, దర్పణ దర్శనములు, మహా బలి హరణ, పూర్ణాహుతి, దేవతామూర్తులకు పంచామృత అభిషేక అలంకరణ, అష్టోత్తర, అష్టావధాన సేవలతో విగ్రహాలు ప్రతిష్టించారు. అలాగే ఆలయ గోపరం పై కలష స్థాపన చేశారు. అనంతరం ఆలయం ఎదుట సీతారాముల కళ్యాణోత్సవాన్ని మంగళ వాయిద్యాలు నడుమ అత్యంత కమనీయంగా వేద పండితులు కళ్యాణం జరిపించారు. వివిధ గ్రామాల నుంచి అశేష జన వాసుల మధ్య సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అనంతరం స్వాముల వారికి మహా మంగళ హారతి తో, గత మూడు రోజులుగా తలపెట్టిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట భక్తి శ్రద్ధలతో ముగిసింది. రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తులకు ఏర్పాటు చేశారు.ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు చెక్క భజనలు, రామ భజనలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిపురం గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.