దేశంలో క్రీడారంగం దుస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అరకొర సదుపాయాలతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ తరచూ విశ్వవేదికపై తమ సత్తా చాటుతున్నారు. దేశానికి పతకాలు తీసుకొస్తూ, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. అటువంటి క్రీడాకారులకు నిలయమైన ఓ స్టేడియాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో వాకింగ్ కోసం ఉపయోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది. అతడి తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నిత్యం క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎటు చూసినా క్రీడాకారులతో ఆ స్టేడియం ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది. అయితే ఐఏఎస్ అధికారి, దిల్లీ రెవిన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ వస్తే మాత్రం క్రీడాకారులు ఎవరూ కనిపించరు. ఆయన అక్కడికి వచ్చే సమయానికే క్రీడాకారులను సిబ్బంది ఖాళీ చేయిస్తారు. ఆ తర్వాత తీరిగ్గా ఆ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తారు. ఈ అంశంపై క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రాత్రి 8.30 వరకు సాధన చేసే వారిమని, అయితే 7 గంటలకే తమను స్టేడియం నుంచి పంపించేస్తున్నారని చెబుతున్నారు. ఐఏఎస్ అధికారి రాత్రి 7 గంటలకు పెంపుడు కుక్కతో వాకింగ్ వస్తారని, అప్పటికి తమను బలవంతంగా బయటకు పంపిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఉన్న అన్ని స్టేడియాలను క్రీడాకారుల కోసం రాత్రి 10 గంటలకు వరకు తెరిచి ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.