నాకు ఆలోచనలు ఎక్కవు. దాంటో నిద్ర పట్టడంలేదు అని కొందరు. విపరీతంగా ఆలోచించడం వల్ల నేను ఏదీ చేయలేకపోతున్నాను అని కొందరు చెబుతుంటారు. కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కారమున్నట్లే ఈ సమస్యకు ఓ పరిష్కారముంది.
మీరు ఆదిత్య 369 సినిమా చూసి ఉంటే అందులో ఓ సీన్‌లో ఆలోచనలకు సంబంధించిన అంశం ఉంటుంది. భవిష్యత్తులోకి వెళ్లిన బాలయ్య బ్యాచ్ అక్కడి ఓ భవనంలో కాసేపు ఉంటారు. ఆ సమయంలో మనసులో ఏమనుకుంటే అది బయటకు వినిపించే టెక్నాలజీ అక్కడ ఉంటుంది. అది తెలియక సుత్తివేలు.. మనసులో ఏవేవో అనుకుంటూ ఉంటారు. అవి బయటకు వినిపిస్తాయి. ఆ సమయంలో ఇతరులు ఆయనకు కాసేపు ఆలోచనలను ఆపుకోమనే సలహా ఇవ్వగా ఆలోచనలను ఎలా ఆపుకుంటాం అని సుత్తివేలు ప్రశ్నిస్తారు. నిజమే ఆలోచనలు ఆగవు. బ్రెయిన్ నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మరి ఆ ఓవర్ థింకింగ్‌కి బ్రేక్ వెయ్యడం ఎలా..?
అతి ఆలోచనలతో ఇబ్బందే. బ్రెయిన్ కూడా కంప్యూటర్ లాంటిదే. అతి ఆలోచనల వల్ల నాడీ కణాలు వేడెక్కుతాయి. అలసిపోతాయి. దాంతో తలనొప్పి మొదలవుతుంది. అందుకే ఆలోచనలకు బ్రేక్ వెయ్యాలి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనికి సంబంధించి టిక్‌టాక్ లో జేడీ మైండ్ ట్రిక్ వీడియో అనేది ఉంది. ఆ ట్రిక్ ప్లే చేసిన వారికి ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. "ఈ జేడీ మైండ్ ట్రిక్ ద్వారా మీ మెదడు మెల్లమెల్లగా ఆలోచించడం మానేస్తుంది. చివరకు మీరు కోరుకున్న సమయంలో పూర్తిగా ఆలోచించడం మానేస్తుంది. అది మీకు అద్భుతంలా అనిపిస్తుంది" అని చెప్పారు.
ఊపిరి తీసుకోవడాన్ని నెమ్మదించండి. తర్వాత మీకు మీరు ఇలా ప్రశ్నించుకోండి. "నా నెక్ట్స్ ఆలోచన ఏది కాబోతోంది" ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు ఏదైనా ఆలోచన వస్తే రానివ్వండి. మళ్లీ ఓసారి లోతుగా ఊపిరి పీల్చండి. మీ కండరాల్ని రిలాక్స్ చేయండి. మళ్లీ మీకు మీరు ఇలా ప్రశ్నించుకోండి. "నా నెక్ట్స్ ఆలోచన ఏది వస్తుంది?" ఇలా కంటిన్యూగా చెయ్యాలి. దీని వల్ల క్రమంగా బ్రెయిన్ ఆలోచించడం తగ్గిస్తుంది. చివరకు పూర్తిగా మానేస్తుందని చెప్పారు.
ఇది బాగా పనిచేస్తోందనీ అద్భుతంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అదే పనిగా ఆలోచించే బాధ లేకుండా పోయిందని చెబుతున్నారు. "మీరు నా బ్రెయిన్‌ని ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టేశారు" అని ఓ యూజర్ చెప్పగా "ఓరి దేవుడో నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోతానో ఎందుకంటే.. నేను నెక్ట్స్ ఏమనాలి అన్నది ఆలోచించేవాణ్ని" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
"నాకైతే నా బ్రెయిన్ పనిచేయడం మానేసి స్థిరంగా ఆలా ఉండిపోయినట్లు అనిపించింది. థాంక్యూ" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఆలోచనలు ఉన్నప్పుడు బ్రెయిన్‌లో ఏదో రభస ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆలోచనలు ఆగిపోతే ఎంతో సైలెంట్‌గా ఉంది. షాక్ అయ్యాను. నైస్" అని మరో యూజర్ చెప్పారు. "దీని వల్ల వెంటనే నా బ్రెయిన్‌ని మ్యూట్‌లో పెట్టేశాను. థాంక్యూ" అని మరో యూజర్ చెప్పారు.
ఇదేమీ విచిత్రం కాదు. భారతీయులు ఏళ్లుగా ఇది చేస్తూనే ఉన్నారు. దీన్నే మనవాళ్లు ధ్యానం అంటారు. ధ్యానంలో బ్రెయిన్‌ని ఒకే అంశంపై ఫోకస్ చేసేలా చేస్తారు. కళ్లు మూసుకొని, మధ్యలో కనిపించేది చూడమని చెబుతారు. లేదా శ్వాసపై ధ్యాస పెట్టమంటారు. అలా చేయడం వల్ల బ్రెయిన్ మిగతా విషయాలను ఆపేసి అదే అంశంపై ఫోకస్ పెడుతుంది. ఇక్కడ ఈ ట్రిక్‌లో నెక్ట్స్ ఆలోచన ఏంటి అనే ఒకే అంశంపై బ్రెయిన్ ఫోకస్ పెడుతోంది. అదొక్కటే ఆలోచిస్తోంది. అందువల్ల బ్రెయిన్ ఏదీ ఆలోచించట్లేదనే అభిప్రాయం కలుగుతోంది.