ప్రకాశం జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడిని ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. దేశ ప్రజలకు ఇలాంటి ఉపాధ్యాయులు మార్గదర్శకం అని కొనియాడారు. ఈనెల 29వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు మార్కాపురం రాంభూపాల్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు.
రాచర్ల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన మార్కాపురం రాంభూపాల్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ అనంతరం తనకు వచ్చిన 25 లక్షల రూపాయల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన నగదు వల్ల వచ్చే వడ్డీ డబ్బులతో 100 మంది నిరుపేద బాలికలకు సుకన్య పథకం ద్వారా చేయూతను అందించారు. తాను ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తున్న సమయంలో 10 సంవత్సరాల లోపు ఉన్న నిరుపేద బాలికలను గుర్తించిన రాంభూపాల్ రెడ్డి వారికి ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
తన స్వగ్రామమైన ఎడవల్లి గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ లో నిరుపేద బాలికలకు సుకన్య పథకం కింద అకౌంట్లు ఓపెన్ చేసి వారి ఖాతాలో ప్రతి రెండు మూడు నెలలకు ఒక్కసారి డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం దేశ ప్రధాని దృష్టికి రావడంతో ప్రధాన ఉపాధ్యాయుడు రాంభూపాల్ రెడ్డి ని ప్రశంసలతో ముంచెత్తారు.
నేను ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయానని రాంభూపాల్ రెడ్డి లాంటి ప్రధాన ఉపాధ్యాయుడు అందరికీ మార్గదర్శకం అని కొనియాడారు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమ గ్రామం పేరును ప్రధాన ఉపాధ్యాయుడు రాంభూపాల్ రెడ్డి పేరును ప్రస్తావించడం స్థానిక గ్రామస్తులు ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాంభూపాల్ రెడ్డి ఉపాధ్యాయుడిగా పలువురు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు చేతుల మీదగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. రాంభూపాల్ రెడ్డి పదవి కాలంలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు చేయూతను అందించారు. స్థానిక ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు రాంభూపాల్ రెడ్డిని అభినందించడంతో పాటు సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.