బిడ్డ కష్టం తీర్చండని కాకినాడ కలెక్టరేట్ లో ఓ తల్లి ఆక్రందన అక్కడి వారిని కంటతడిపెట్టించింది. కనికరం చూపించాల్సిన అధికార్లు సమస్య పరిష్కారానికి ముప్పతిప్పలు పెట్టడంతో కలెక్టర్ కు స్పందన లో ఫిర్యాదు చేసింది. తల్లడిల్లిపోతున్న ఆ తల్లి బాధ చూసిన కలెక్టర్ ఆరోగ్యశాఖ వైద్యులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే వైద్యాధికార్లు ఎలా స్పందిస్తారో, ఈ బిడ్డ కష్టం ఎలా తీర్చుతారా, లేదా పాత సీనే రిపీట్ అవుతుందా... వాచ్ దిస్ స్టోరీ.
13ఏళ్ల బిడ్డతో ఇక్కడ కంటతడి పెట్టుకొని మాట్లాడుతున్న ఈమె పేరు అమలదాసు గౌరీదేవి. కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం ఆర్కేరేవుల గ్రామం. భర్త శివశంకర్ గౌరీదేవి ని బిడ్డలతో సహా వదిలేసి చాన్నాళ్ల క్రితమే ఎటో పోయాడు. ఈమెకు 13ఏళ్ల ఈ కొడుకు రమేష్, 15 ఏళ్ల కూతురు ఉన్నారు. కూలీ పని చేసుకొని ఇద్దరు బిడ్డలను సాకుతోంది. భర్త లేకపోవడంతో కూతురికీ త్వరగా పెళ్లి చేసేసింది. అయితే అల్లుడు విడిచిపెట్టేయడం గౌరీదేవి జీవితంలో మరో విషాదం.
ఈ కష్టం తోనే జీవితం నెట్టుకొస్తున్న గౌరీ దేవి కి మరో కష్టం వచ్చి పడింది. 8వ తరగతి పూర్తి చేసిన కొడుకు రమేష్ కుడి చేతికి ఫైలేరియా వచ్చింది. కుడి చేయి అనూహ్యంగా పెరిగిపోయింది. ఇప్పుడు చేతిని ఎత్తడానికి కూడా వీలు లేనంత భారం అయిపోయింది.
ఆపరేషన్ చేయాలంటే సుమారు లక్షా అరవైవేల రూపాయిలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ కు సౌఖర్యాలు లేకపోవడంతో ఆపరేషన్ మీద ఆశలు వదిలేసింది. పేదరికం ఆపరేషన్ మీద ఆశ వదిలేలా చేసింది గాని, నిబ్బరంగా చదువుకుంటున్న కొడుకు కష్టం తీరేదెలా అన్నది ఈ తల్లిని మరింత క్షోభకు గురిచేసింది. నా కొడిక్కి కష్టం వచ్చింది ఆదుకోండని ఎవరెవరినో వేడుకుంది ఈ అభాగ్యురాలు. ఎవరూ కనికరించలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని గ్రామ సచివాలయానికి, తహశీల్దార్ కార్యాలయానికి, ఎం. పి. డి. ఓ కార్యాలయానికి, సదరన్ సర్టిఫికేట్ కోసం ఆస్పత్రులకు తిరిగి తిరిగి అలసిపోయింది. కాకినాడ కు వెళ్తే రాజమండ్రి అని, రాజమండ్రి వెళ్తే కాకినాడ అని ఏవేవో ఆఫీసుల చుట్టూ కనికరం లేని అధికార్లు తిప్పి తిప్పి వేధించారు.
జిల్లాల పునర్విభజన తరువాత తొలిసారి కాకినాడ జిల్లా కలెక్టర్ ను స్పందన కార్యక్రమంలో కలసి వినతి పత్రం ఇచ్చింది. స్పందించిన జిల్లా కలెక్టర్ రమేష్ కు ఆపరేషన్ చేయమని కాకినాడ జిజి హెచ్ వైద్యులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఫైలేరియా ఆపరేషన్ కు, ప్లాస్టిక్ సర్జరీ కి సౌఖర్యాలు ఉన్నాయా లేదా అన్నది ప్రశ్నార్ధకం గా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో రమేష్ కష్టం ఎలా తీరుతుందో అధికార్లు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ఒక విషయం, దివ్యాంగుడు గా గుర్తించి పెన్షన్ అయినా ఇస్తే ఈ కుటుంబానికి కొంత ఊరట. ఇలా అయినా అధికార్లు కనికరిస్తారో లేదో కొద్ది రోజుల్లో తేలిపోతోంది. కానీ మనసున్న మారాజులు గౌరీ దేవి ని ఆదుకుంటే మాత్రం ఈమె కష్టం తీరిపోతుంది. ఈ కధనం చూసిన వారు స్పందించాలని లోకల్ యాప్ కూడా కోరుకుంటోంది.