ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీలో గ్రూపు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీంతో జిల్లాలో పార్టీ ఏమవుతుందన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. ఇద్దరు సీనియర్ నేతలు డీ అంటే ఢీ అనడంతో అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇద్దరు నేతల మధ్య వార్ మరింత ముదురుతోంది.. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. జేసీ వర్గం పల్లె విషయంలో తగ్గేది లేదంటుంటే.. రఘునాథరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తన గురించి మాట్లాడే హక్కు లేదంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జేసీ వర్గం మాజీ మంత్రి పల్లెపై మరో ఆరోపణ చేసింది. ఏకంగా వైఎస్సార్‌సీపీ సభకు రఘునాథరెడ్డి కాలేజీ బస్సులు పెట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
‘ఎవరు నిజమైన టీడీపీ నాయకుడు.. కొన్ని బస్సులపై కేసులు బనాయిస్తే.. వైసీపీ నాయకుల ముందు మోకరిల్లకూడదని తమకు చెందిన మొత్తం బస్సులు, లారీలు, ఇతర పెద్ద పెద్ద వాహనాలు ఎక్కడా తిప్పకుండా కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా ఏమాత్రం జంకని జేసీ ప్రభాకర్ రెడ్డి నిజమైన టీడీపీ నాయకుడా..? వైసీపీ బస్సుయాత్ర మీటింగ్‌కి తన విద్యాలయాలకు చెందిన బస్సులను పంపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిజమైన టీడీపీ నాయకుడా’అంటూ పోస్టులు పెడుతున్నారు. నేరుగా అధినేత చంద్రబాబును ట్యాగ్ చేశారు. అంతేకాదు జేసీ ఫ్యామిలీ నడిపిస్తున్న ఓ ఫేస్‌బుక్‌లో పోస్ట్ వైరల్ అవుతోంది.
‘టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తికి వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన పల్లె ఉచ్చులో పడిన కార్యకర్తలు, నాయకుల్లారా.... టీడీపీ మహానాడుకు సైకం శ్రీనివాస్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళితే నానా యాగీ చేసిన ప్రియమైన టీడీపీ నాయకుల్లారా.. చూశారా?. టీడీపీలో తానొక్కడే నాయకుడని చెప్పుకుంటున్న.. తాను మాత్రమే పుట్టపర్తిలో టీడీపీకి దిక్కు అని చెప్పుకుంటున్న మన ప్రియతమ మాజీ మంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ పల్లె రఘునాథరెడ్డి వారి విద్యాలయాలకు చెందిన బస్సులను వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర మీటింగ్‌కి తరలించారు.. అయ్యా జేసీని అడ్డుకునే నాయకులూ, సైకంని తిట్టి పోసుకుంటున్న నాయకులూ కనిపిస్తోందా... మీ ప్రియమైన నాయకుడు మాజీ మంత్రి భాగోతం.. దీన్నేమంటారూ.. చంద్రబాబు యాత్రకు కూడా తరలించని తన విద్యా సంస్థల బస్సులు వైసీపీ సభకు పంపడం ఏమంటారో మీరే చెప్పండి సామీ’అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు గతంలో కూడా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆయన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో భేటీ కావడం.. ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పల్లె తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ సభకు బస్సులు పంపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. దీనిపై మాజీ మంత్రి రఘునాథరెడ్డి స్పందించాల్సి ఉంది.