ఐటీ ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం కనీసం వాళ్లు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయడం దారుణమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇంటర్నెట్ సామాన్యుడి జీవితంలోనూ భాగమైందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో.. వారం రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదన్నారు.
ఇదిలావుంటే కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఆందోళనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే అంశాలు ఫార్వార్డ్ చేయకుండా చూడాలనే ఉద్దేశంతో పోలీసులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారంగా నడిచే పనులు నిలిచిపోయాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఆగిపోగా.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు నెట్ కోసం గోదావరి గట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరైతే ఇంటర్నెట్ కోసం పొరుగు జిల్లాలకు సైతం వెళ్తున్నారు.
అమలాపురం అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేయడంపై చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేకపోవడం అసమర్థ పాలనకు నిదర్శనమంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరమన్నారు.