వేసవి వచ్చిందంటే బజార్లలో దర్శనమిచ్చే వాటిలో ఒకటి తాటిముంజులు. ఐస్ యాపిల్ గా పిలవబడే తాటి ముంజులను ఇష్టపడని వారుండరు. వేసవి దాహార్తికి తాటిముంజులు చక్కని పరిష్కారం. అయితే, ముంజులను తోలు తీసుకుని తినటం సాధారణ పద్దతి. ముంజులతో జ్యూస్ చేసుకుని తాగటం వెరైటీ. మరి ఈ వెరైటీ రెసిపిని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందామా...
కావలసిన పదార్థాలు: ముంజులు - డజను, లేత కొబ్బరిబొండం - 1, తేనె - కొద్దిగా , నిమ్మకాయ - 1, పుదీనా ఆకులు - కొన్ని.
తయారీవిధానం: ముందుగా లేత కొబ్బరిబోండంలోని నీళ్లను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముంజులను తోలు తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఈ క్రమంలో ముంజులలో వుండే నీళ్లను వేరే గ్లాసులోకి తీసుకోండి. ఇప్పుడొక గ్లాసును తీసుకుని సగానికి పైగా కొబ్బరినీళ్లతో నింపి తర్వాత అందులో తేనెను, నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముంజుల ముక్కలను ఇందులో కలుపుకోవాలి. ఇష్టమైతే కొన్ని పుదీనా ఆకులను నలిపి ఈ రసంలో వేసుకుంటే సరి. శరీర ఉష్ణోగ్రతను యిట్టే తగ్గించే ఈ జ్యూస్ మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి. చాలా రుచిగా ఉంటుంది.