తూర్పు పసిఫిక్ హరికేన్ సీజన్‌లో అత్యంత బలమైన తుఫాన్‌గా అగాథ చరిత్ర సృష్టించింది. తుఫాన్ ప్రభావానికి కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలు మునిగిపోవడంతో.. అక్కడి ప్రజలు నీటిలోంచే ప్రయాణాలు సాగిస్తున్నారు. చాలా ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఆగి ఉన్న వాహనాల కిటికీల వరకు నీరు చేరుకుంది.
మెక్సికోలో అగాథ తుఫాన్ విరుచుకుపడుతుంది. ఎడతెరిపి లేని వర్షాలతో చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికే పది మంది మరణించారు. మరో 20 మంది గల్లంతయ్యారు. అంతేకాదు తూర్పు పసిఫిక్ ప్రాంతంలో మే నెలలో వచ్చిన అతిపెద్ద తుఫాన్‌గా అది రికార్డైంది. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీట మునిగాయి. రహదారులు జలమయం అయ్యాయి. చాలా చెట్లు నేలకూలాయి. కొన్ని రోడ్లు కొట్టుకుపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని గంటల పాటు ఆగకుండా వీచాయి.
తుఫాన్ కారణంగా మెక్సికో దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంత పట్టణాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ సందర్భంగా దక్షిణ రాష్ట్రం ఓక్సాకా మే గవర్నర్ అలెజాండో మురాత్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఇళ్లలోకి భారీగా నీరు చేరుతుందని చెప్పారు. చాలా ఇళ్లు కొట్టుకుపోయాయన్నారు. కొండ చరియలు విరిగిపడడం, నదుల పొంగి ప్రవహించడంతో మరణాలు సంభవించినట్టు తెలిపారు. సముద్రతీరం నుంచి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అనేక చిన్న పట్టణాల్లో మరణాలు ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. అలాగే హుటుల్కో రిసార్ట్ సమీపంలో ముగ్గురు పిల్లలు తప్పిపోయారన్నారు.
మరోవైపు బ్రెజిల్‌లో కూాడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఇప్పటి వరకు 106 మంది చనిపోయారు. దిగువ ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. కొండ చరియలు విరిగిపడి రాష్ట్ర రాజధాని రెసిఫ్‌లో ఇళ్లు దెబ్బతిన్నాయి.
అలాగే పెర్నాంబుకోలోని సుమారు 24 మున్సిపాలిటీలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఆ రాష్ట్రంలో సుమారు ఆరు వేల మందికిపైగా ఇళ్లను కోల్పోయినట్టు నివేదకిలు చెబుతున్నాయి. దీంతో అక్కడ ఎటు చూసినా నీట మునిగిపోయిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి.