నంద్యాల జిల్లా రుద్రవరం సబ్ డివిజనలోని పెద్దకంబలూరు ఫారెస్టు సెక్షనలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ పెద్దపులి మృతి చెందిన విషయం విదితమే. బుధవారం చెలిమ రేంజిలోని పెద్దకంబలూరు సమీపంలో పెద్దపులి మృతికి కారణమైన షేక్ అబ్దుల్లా, యు. గుర్రప్ప అనే నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎఫ్‌వో వినితకుమార్ తెలిపారు. పెద్దపులి ఉచ్చులోపడి మృతి చెందడానికి తామే కారణమని, అడవిలో పందుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పులి పడి మృతి చెందిందని విచారణలో అంగీకరించారని ఆయన తెలిపారు. కళేబరాన్ని తెలుగుగంగ ప్రధాన కాలువ నీటి ప్రవాహంలో పడేసినట్లు చెప్పారన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కోవెలకుంట్ల మెజిసే్ట్రట్ తిరిగి తమకే అప్పగించారని చెప్పారు. దీంతో నిందితులను రుద్రవరం ఫారెస్టు కార్యాలయానికి బుధవారం రాత్రి తరలించామని వివరించారు. పెద్దపులి మృతి ఘటనలో పెద్దకంబలూరు సెక్షన ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, బీట్ ఆఫీసర్ జేమ్స్‌పాల్‌ను అప్పట్లో ఫారెస్టు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.