ఇటీవల మన దేశంలో మత చర్చ టీవీ డిబేట్ల కారణంగానే బాగా పెరిగిపోయిందన్న విమర్శల నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కీలక నిర్ణయం తీసుకొంది. తద్వారా మతపరమైన ఉద్రిక్తలను తగ్గించాలని మంచి ఆలోచన చేసింది. ఇదిలావుంటే ఇటీవల ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన ఫలితంగా నుపుర్, నవీన్ జిందాల్ బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ముస్లిం పండితులు, మౌల్వీలు టీవీ చానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. చానల్ డిబేట్లకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఉర్దూ, హిందీ భాషల్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సున్నితమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నట్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది.