హెయిర్ లాస్.. మహిళలను వేధించే కీలకమైన సమస్య. అందంగా ఉండడానికి రకరకాల హెయిర్ స్టైల్స్‌ను మహిళలు ఫాలో అవుతుంటారు. అలాంటి జుట్టు ఊడిపోతుంటే.. అంతే బాధపడుతుంటారు. రకరకాల షాంపూలు, కండీషనర్లు ఉపయోగిస్తుంటారు. అయితే జుట్టు పోషణకు బయట నుంచి ఎన్ని ప్రయత్నాలు చేయాలో .. పోషకాహారాన్ని కూడా అందించాలి. అసలు జుట్టు ఊడిపోవడానికి ఒత్తిడి ప్రధాన కారణం. స్ట్రెస్ కారణంగా జుట్టు పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జుట్టు ఆరోగ్యంగా ఉండడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. టెక్సాస్‌లోని బేయర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక పరిశోధనలో ప్రోటీన్, జింక్, విటమిన్ డి లోపం వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోతుందని తేలింది. మంచి డైట్ జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. కాలుష్యం కూడా జుట్టు రాలడానికి మరో కారణం. పొల్యూషన్ వల్ల జుట్టు విచ్ఛిన్నం అయి జుట్టు రాలిపోతుంది. గాలిలో పొగ, సీసం, నికెల్, సల్ఫర్ డయాక్సైడ్ ఉండటం వల్ల నగరాల్లో నివసించే వారికి ఎక్కువ జుట్టు రాలిపోతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, థైరాయిడ్ వంటి వ్యాధుల కారణంగా కూడా జుట్టు రాలుతుంది. అందుకే ఐరన్, జింక్, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వీలైనంత వరకు జుట్టు మీద రసాయనాల వాడకాన్ని నివారించాలి. బయటకు వెళ్లేటప్పుడు జుట్టు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే తలపై కాలుష్య ప్రభావం లేకుండా అవుతుంది. జుట్టు రాలడం ఆపాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.