ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనేక చిక్కుముళ్లకు సమాధానలు దొరకొచ్చు: శాస్త్రవేతల అంచనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 10:05 PM

మధ్యప్రదేశ్‌లో డైనోసార్ గుడ్లను గుర్తించిన వార్త ఆసక్తికర చర్చకు తావిస్తోంది. తాజాగా ధార్‌లో బయటపడిన డైనోసార్ గుడ్ల శిలాజాలపై మరిన్ని పరిశోధనలు పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రధానంగా డైనోసార్ల పునరుత్పత్తి వ్యవస్థ.. పక్షులు, మొసళ్లు, తాబేళ్లు, బల్లుల పునరుత్పత్తి వ్యవస్థను పోలినదేనా? అనే విషయం తెలుసుకునేందుకు ఈ డైనోసార్ గుడ్డు ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ ప్రసాద్ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. సరీసృపాలు, పక్షుల పునరుత్పత్తి వ్యవస్థలకు ఉన్న సంబంధాల గురించి కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఇది బాటలు వేయనుందని ఆయన రాసుకొచ్చారు.


ఇదిలావుంటే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్  జిల్లాలో ఉన్న డైనోసార్ ఫాసిల్ నేషనల్ పార్క్‌లో లో పరిశోధనలు నిర్వహించింది. ఇక్కడ పలుచోట్ల జరిపిన తవ్వకాల్లో శిలాజ డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. మొత్తం 10 డైనోసార్ గుడ్ల శిలాజాలు బయటపడ్డాయని పరిశోధకులు తెలిపారు. పరిశోధకుల్లో ఒకరైన గుంటుపల్లి వి.ఆర్. ప్రసాద్ దీనికి సంబంధించి రాసిన వ్యాసం ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురితమైంది. ఇందులో డైనోసార్ గుడ్ల శిలజాలకు సంబంధించి ప్రొఫెసర్ ప్రసాద్ ఆసక్తికర వివరాలు తెలిపారు.


పార్కులో మొత్తం 52 డైనోసార్ల గూళ్లను పరిశోధకులు గుర్తించారు. వాటిని లోతుగా పరిశీలించి గుడ్ల శిలాజాలను గుర్తించారు. 10 గుడ్లలో ఒకటి మరింత ప్రత్యేకమని ప్రొఫెసర్ ప్రసాద్ అన్నారు.


‘సాధారణంగా గుడ్డుపై ఒక ఎగ్ షెల్ ఉంటుంది. కానీ, వృత్తాకారంలో ఉన్న ఈ గుడ్డులో లోపల అదనంగా మరో ఎగ్ షెల్ ఉంది. అంటే.. గుడ్డులో మరో గుడ్డు లాంటి నిర్మాణం అన్నమాట. ఇలాంటి నిర్మాణం పక్షుల గుడ్లలో ఉంటుంది. సరీసృపాల గుడ్డులో ఇలాంటి నిర్మాణం ఇప్పటివరకు బయటపడలేదు. డైనోసార్ల శిలాజ గుడ్లలో ఇలాంటి నిర్మాణం బయటపడటం అరుదైన విషయమే’ అని ఆ కథనంలో పరిశోధకులు వివరించారు.


సరీసృపాల పునరుత్పత్తి విధానానికి భిన్నంగా ఈ గుడ్డులో అంతర్గత నిర్మాణం ఉందని ప్రొఫెసర్ వి.ఆర్.ప్రసాద్ అన్నారు. డైనోసార్లు, మొసళ్లు, తాబేళ్లు, బల్లులు, సరీసృపాలలో ఇప్పటివరకు ఇలా గుడ్డులో మరో గుడ్డు నిర్మాణం బయటపడలేదని ఆయన వివరించారు. గతంలో పక్షుల గుడ్లలో మాత్రమే ఈ తరహా నిర్మాణాన్ని గుర్తించినట్లు తెలిపారు.


తాజాగా గుర్తించిన గుడ్లు టైటానోసౌరిడ్‌కు చెందిన డైనోసార్లవిగా పరిశోధకులు చెబుతున్నారు. సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్‌లు ఇప్పటివరకు భూమి మీద నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటిగా భావిస్తున్నారు. కొన్ని మిలియన్ ఏళ్ల కిందట ఇవి భారత భూభాగంలో ఉండేవట. ఈ డైనోసార్లకు సంబంధించిన శిలాజాలు గతంతో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయాలోని కొన్ని ప్రాంతాల్లోనూ బయటపడ్డాయి.


గతేడాది మధ్యప్రదేశ్‌లోని సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం సమీపంలో బడవానీ అడవిలో 10 డైనోసార్‌ రాతి గుడ్లను కనుగొన్నారు. అవి కోటి సంవత్సరాల కిందటి డైనోసార్‌ గుడ్ల శిలాజాలని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సైంటిస్ట్ డాక్టర్‌ డి.పి .పాండే పురాతన శిల్పాలు, కోటలపై సర్వే చేస్తూ గతేడాది ఫిబ్రవరి 5న అటవీ సిబ్బందితో పాటు వర్ల గ్రామ సమీపంలోని అడవికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న రాతి గుడ్లు పాండే కంటపడ్డాయి. వాటిలో ఒక గుడ్డు 40 కేజీలు ఉండగా, మిగతావి 25 కేజీల మేర ఉన్నాయి. వాటిని ఇండోర్‌ మ్యూజియంకి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa