వైసీపీ అధినేత రాష్ట్రంపై పడి దోచుకుంటుంటే, వైసీపీ నేతలు ఊర్ల మీద పడుతున్నారని విమర్శించారు. ఏమీ దొరక్కపోతే గుడి, గుడిలో లింగాన్నీ దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మరకత విగ్రహం ఘటనే కాకుండా, రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు నగలు, విగ్రహాలు ఎత్తుకుపోతున్నారని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
ప్రకాశం జిల్లాలో వెంకటేశ్వరరెడ్డి అనే వైసీపీ నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువ చేసే మరకత విగ్రహం లభించడం పట్ల నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ కొల్లగొట్టిన విగ్రహాల్లో ఇదొకటని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత ఇంట్లో మరకత వినాయకుడి విగ్రహం రూపంలో బయటపడిందని పేర్కొన్నారు. ఓ చోటా వైసీపీ నేత ఇంట్లోనే రూ.25 కోట్ల విలువైన విగ్రహం బయటపడిందంటే, వైసీపీ పెద్ద నేతల ఇళ్లలో ఇంకెన్ని పురాతన విగ్రహాలు ఉన్నాయోనని లోకేశ్ సందేహం వ్యక్తం చేశారు.
జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి వైసీపీ ముఠాలే హిందూ ఆలయాలపై దాడులు చేసి, టీడీపీపై ఆరోపణలు చేశారని లోకేశ్ మండిపడ్డారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన, దుర్గమ్మ వెండి సింహాల మాయం, రామతీర్థం క్షేత్రంలో రాముడి తల నరికివేత ఘటనల్లో నేటికీ నిందితులు దొరకలేదని విమర్శించారు. అయితే, వెంకటేశ్వరరెడ్డి వంటి వైసీపీ నేతల ఇళ్లలో విగ్రహాలు దొరుకుతున్నాయని వివరించారు. ఈ దొంగ ప్రభుత్వం, దోపిడీ పాలకుల హయాంలో ప్రజలకే కాదు, దేవాలయాల ఆస్తులకు, దేవతా విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అర్జంటుగా కేంద్ర బృందంతో గానీ, న్యాయ బృందం పర్యవేక్షణలో గానీ ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవుళ్ల నగలు, విగ్రహాలు వైసీపీ నేతల పిల్లల మెడలో ఆభరణాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.