డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొరడా ఝుళిపించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు కలిగి ఉన్నా ప్రయాణికులను విమానం ఎక్కడానికి తిరస్కరించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఓ ప్రకటనలో డీజీసీఏ వెల్లడించింది. తమ వద్ద వ్యాలిడ్ టికెట్లు ఉన్నా.. సమయానికి ఎయిర్‌పోర్టులో ఉన్నా.. చెకింగ్స్ అన్ని పూర్తి చేసుకున్నా కొన్ని విమాన సంస్థలు తమను తిరస్కరించాయని కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పాటించాల్సిన డీజీసీఏ నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో తనిఖీలు చేసిన తర్వాత కొన్ని విమానయాన సంస్థలు ఇలాంటి సందర్భాల్లో పాటించాల్సిన నిబంధనలను పాటించడం లేదని డీజీసీఏ తెలిపింది. ఎయిర్ ఇండియా సంస్థ రెగ్యులషన్స్ ఫాలో కావడం లేదని వివరించింది. అందుకే ఆ సంస్థకు షోకాజ్ నోటీసు పంపామని పేర్కొంది. ఇలా వ్యాలిడ్ టికెట్లు కలిగి ఉండి కూడా బోర్డింగ్‌కు అనుమతి ఇవ్వని సందర్భంలో నిబంధనలు అమలు చేసే వ్యవస్థ ఎయిర్ ఇండియాలో లేనట్టుగా తోస్తున్నదని తెలిపింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్షన్‌లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, వెంటనే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.వ్యాలిడ్ టికెట్లు ఉన్నప్పటికీ ప్యాసింజర్లను బోర్డింగ్‌కు అనుమతించని సందర్భంలో ఆ ప్రయాణికులకు గంటలోపే మరో ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ నిబంధనలను గుర్తు చేసింది. గంటలోపే ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేస్తే అలాంటి సందర్భంలో ప్రయాణికులకు పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని తెలిపింది.
ఒక వేళ ఆ ప్రయాణికులకు ఆల్టర్నేట్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేయడానికి 24 గంటల్లోపు సమయం పడితే.. ప్రయాణికులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ఒక వేళ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడానికి 24 గంటలు దాటితే.. ప్రయాణికులకు రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని పేర్కొంది.