ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 488వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షలలో ఎల్‌ఎంఎం, ఎస్‌బీఎం విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వరసాల మాట్లాడుతూ ఈ నెల 26న 500వ రోజు రిలే నిరాహార దీక్షలను పురస్కరించుకొని నిర్వహించనున్న ప్రదర్శనలో అదిక సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే విధంగా ఉక్కు ఉద్యమాలను ఉధృతం చేయాలని కోరారు. మరో నాయకుడు కె. ఎస్. ఎన్. రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎన్‌ఎండీసీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీ నాయకులు సత్యనారాయణ, గంగవరం గోపి, జి. ఆనంద్, సోమి నాయుడు, చిన్నంనాయుడు, రవిచంద్ర, గణపతి, తిరుమలరావు, వేములపాటి ప్రసాద్ పాల్గొన్నారు.