చేయాల్సింది 75 ఓవర్లలో 300 పరుగులు. మిగిలింది మూడు సెషన్లు. ఎంత వన్డేలు, టీ20లు వచ్చినా టెస్టు క్రికెట్ లో ఆ స్కోరు చేయడం సాహసమే. వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉండటంతో మేటి జట్లు సైతం ఎందుకు వచ్చిన తంటా అనుకుని డ్రా కోసమే ఆడతాయి. ట్రెంట్ బ్రిడ్జిలో న్యూజిలాండ్ తో రెండో టెస్టులో భాగంగా ఐదో రోజు ఇంగ్లాండ్ మాత్రం డ్రా గురించి ఆలోచించలేదు. పోరాడితే పోయేదేమీ లేదన్న తరహాలో రెచ్చిపోయి కివీస్ ను చిత్తు చేసింది. 300 పరుగుల లక్ష్యాన్ని మరో 20 ఓవర్లు మిగిలుండగానే ఊదేసింది.
ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. ఆ జట్టు ఆటగాడు జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 136.. 14 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో విజయంతో పాటు సిరీస్ ను కూడా సాధించిపెట్టాడు. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 75 నాటౌట్.. 10 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా ఓ చేయి వేసి తన కెప్టెన్సీ కెరీర్ లో ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ను గెలుచుకున్నాడు. లార్డ్స్ లో జరిగిన తొలి టెస్టులో కూడా ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెలిసిందే.
రెంటో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 553 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ దీటుగా బదులిస్తూ 539 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగుల స్వల్ప ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 284 రన్స్ చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఎదుట 299 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
ఆఖరి రోజు ఆటలో బెయిర్ స్టో ఆటే హైలైట్. 300 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 93 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ డ్రా కోసం ప్రయత్నిస్తుందనకున్నారంతా. కానీ బెయిర్ స్టో మాత్రం దొరికిన బంతిని దొరికనట్టు బౌండరీ లైన్ దాటించాడు. అతడికి స్టోక్స్ కూడా జతకలవడంతో భారీ లక్ష్యం చిన్నపోయింది. టెస్టును టీ20గా మార్చిన బెయిర్ స్టో, స్టోక్స్ లు ఐదో వికెట్ కు 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఈ సిరీస్ లో ఆఖరిదైన మూడో టెస్టు జూన్ 23 నుంచి లీడ్స్ లో జరుగనుంది.