మంత్రి బొత్స సత్యనారాయణకు సారా వ్యాపారం మాత్రమే తెలుసునని.. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. రాష్ట్రం కోసం మాత్రమే తన బాధంతా అని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయతీపరుడైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని చెప్పారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అశోక్ ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు.
క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రా’ నినాదంతోనే ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన రోడ్ షోలో భారీగా పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యావసరాల ధరలు పెంచి పేదలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
తాము టిడ్కో ఇళ్లు కట్టామని.. వాటిని లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలకు స్థలాలు, ఇళ్లు ఇవ్వడం లేదని.. కనీసం ఇళ్లు కట్టుకున్న వారికి బిల్లులు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి దేవుడు తనకిచ్చాడని.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ దిక్కుమాలిన పాలన గురించి పిల్లలకూ అర్థమైందని చంద్రబాబు తెలిపారు. ప్రజల ఆస్తులు కబ్జాల చేస్తూ సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదుల్లా తయారయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను డిమాండ్ చేసిన తర్వాతే పోలీసుల టీఏ, డీఏకు నిధులు విడుదల చేశారని తెలిపారు.