సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ పలు చర‍్యలు చేపట్టినట్టు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స‍్పష్టం చేశారు. రైళ్లలో అనుమానితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల జోలికొళ్తే కఠిన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే తర్వాత ఏ ఉద్యోగమూ రాదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అబద్ధపు ప్రచారాలు, పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్మీ నియామకాలకు సంబంధింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నం, గుంటూరు రైల్వే స్టేషన్లపై సంఘ విద్రోహులు దాడి చేసే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ముఖ్యంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీలో కూడా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు.. ఏపీలోని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్లలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.