ఏపీలో సినీ టికెట్ల అమ్మకాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి టాలీవుడ్ ససేమిరా అంటోంది. ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలపై తాజాగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఎగ్జిబిటర్లు అంగీకరించడం లేదు. దీంతో ఎగ్జిబిటర్లతో పూర్తిస్దాయిలో ఒప్పందాలు చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దీనికి వారు చెప్తున్న అభ్యంతరాలే కారణం. టికెట్లు మేమే అమ్మి మీకు మీ వాటా ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనే సమస్యకు కారణమవుతోంది.
ఏపీలో ఆన్ లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయంచేందుకు వీలుగా ప్రభుత్వం ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు బాధ్యత అప్పగించింది. దీంతో ఆన్ లైన్ టికెట్ల అమ్మకాల కోసం ఓ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేందుకు ఏపీఎఫ్ డీసీ ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో సినిమా టికెట్లు అమ్మాలంటే థియేటర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం విధించిన నిబంధన కీలకంగా మారింది. సినిమా టికెట్లను ఏపీఎఫ్డీసీ ద్వారా మేమే అమ్ముతాం. వాటిలో మీకు వచ్చే వాటాను టికెట్లు అమ్ముడయ్యాక ఇచ్చేస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనికి ఎగ్జిబిట్లర్లు అంగీకరించడం లేదు.
ఇదిలావుంటే గతంలో ఏపీలో సినిమా ధియేటర్లు పేటీఎం, బుక్ మై షో వంటి ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏపీఎఫ్డీసీ ద్వారా ఒప్పందాలు చేసుకోవాలని అల్టిమేటం ఇస్తోంది. దీంతో పాత ఒప్పందాలను ఇప్పటికిప్పుడు బ్రేక్ చేసుకోవడం కుదరదనే వాదన ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తోంది. ఈ ఒప్పందాలను మధ్యలో బ్రేక్ చేస్తే గతంలో ఆయా సంస్ధల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సాధ్యం కాదనే వాదన ఎగ్జిబిటర్లు వినిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎగ్జిబిటర్ల వాదనకు ససేమిరా అంటోంది. దీంతో ప్రతిష్టంభన నెలకొంది.
కానీ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఏ సినిమాకైనా టికెట్ల అమ్మకాలను ఏపీఎఫ్డీసీ ద్వారా చేపడతారు. ఇలా వసూలు చేసిన సొమ్ము నేరుగా నిర్వహణ ఖాతాకు వెళ్తుంది. అందులో నుంచి సర్వీస్ ట్యాక్స్ మినహాయించుకుని మిగతా మొత్తం మీ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనికి అంగీకరిస్తూ ఏపీఎఫ్డీసీతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఒప్పందాలు చేసుకోకపోతే థియేటర్ల లైసెన్స్ లు రద్దు చేస్తామని బెదిరిస్తోంది. దీంతో ఎగ్జిబిటర్లు బెంబేలెత్తుతున్నారు.
ఇదిలావుంటే ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలు మేమే చేస్తాం, అందులో మీ వాటా మీకిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనకు ఎగ్జిబిటర్లు నో అంటున్నారు. దీని వెనుక వారు పలు కారణాలు చెప్తున్నారు. ఉదాహరణకు ఓ సినిమా టికెట్లు అడ్వాన్స్ గా అమ్మేశారు. ఆ తర్వాత సినిమా పడలేదు. అప్పుడు ప్రేక్షకులకు డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే థియేటర్ కు వచ్చి నేరుగా టికెట్లు కొనే వారికి ప్రభుత్వం విధిస్తున్న 2 శాతం సర్వీస్ ఛార్జ్ ఎందుకని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వానికీ, ఎగ్జిబిటర్లకు మధ్య జరిగిన ఒప్పంద ఉల్లంఘన జరిగితే అమరావతిలోని మధ్యవర్తిత్వ కేంద్రంలో పరిష్కరించుకోవాలనే వాదనపైనా అభ్యంతరాలు చెప్తున్నారు. ఈ మధ్యవర్తిత్వ కేంద్రంలో అంతా ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.