టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. టీడీపీ కార్యక్రమాలకు జనం భారీగా వస్తుండడంతో అటు సీఎం జగన్, ఇటు వైసీపీ మంత్రులు, పార్టీ ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది.ప్రజల నుంచి చంద్రబాబుకు లభిస్తున్న మద్దతును చూసి సీఎం జగన్ ఓర్వలేక, టీడీపీ నేతలపై పరోక్షంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. చోడవరం మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయన ఇంటి గోడను కూల్చడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. ఎన్ని రకాలుగా అణిచేసే ప్రయత్నం చేసినా లాభం ఉండదన్న విషయాన్ని వైసీపీ మంత్రులు గుర్తించాలన్నారు.