ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూల్చివేతలతో...మెజార్టీ లేకున్నా అధికార పీఠం దక్కించుకొన్న బీజేపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 02:41 AM

మెజార్టీ లేకపోయినా సరే వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ అక్కడ అధికారం చేపట్టిందన్న విమర్శలున్నాయి. మోడీ కేంద్రంలో అధికారం చేపట్టాక కూలిన ప్రభుత్వాల వివరాలు ఇలావున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ 2014లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి తాజాగా మహారాష్ట్రలో ఏర్పడిన సంక్షోభవం వరకు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు, కుప్పకూలాయి. చిత్రం ఏమిటంటే అవన్నీ మెజారిటీ సీట్లు సాధించిన ప్రభుత్వాలే అవవడం గమనార్హం. ఫిరాయిచిన ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజల మద్దతుకన్నా ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.


మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 2018 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ కమల్ నాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 121 మంది సభ్యుల మద్దతు ఆయనకుంది. తర్వాత జ్యోతిరాదిత్య సింథియాతోపాటు 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020 మార్చిలో బీజేపీ తరఫున శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ సీట్లు రాకపోయినప్పటికీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం లెక్కచేయలేదు.


కర్ణాటకలో 2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. మొత్తం స్థానాలు 222. బీజేపీకి 104, కాంగ్రెస్ కు 80, జేడీ ఎస్ కు 37 వచ్చాయి. యడ్యూరప్ప ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసినా నిలవలేదు. తర్వాత కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరింది. 2019లో కాంగ్రెస్, జేడీ ఎస్ నుంచి 16 మందిని బీజేపీ తనవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


మణిపూర్ లో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28 చోట్ల విజయం సాధించింది. మొత్తం స్థానాలు 60. అయితే గవర్నర్ 21 స్థానాలు సాధించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గవర్నర్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.


జమ్మూ కాశ్మీర్ లో 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ లభించలేదు. బీజేపీ 25 సీట్లు, పీడీపీ 28 సీట్లు సాధించాయి. ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. కొద్దిరోజుల తర్వాత పీడీపీతో అధికారం పంచుకోవడానికి కమలంపార్టీ ముందుకు రావడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది.


2016 మార్చినెలలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్ లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. సుప్రీంకోర్టు జోక్యంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.


2015 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీయూ, ఆర్ జేడీ, కాంగ్రెస్ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమిలో బీజేపీ చీలికలు తెచ్చింది. 2017లో కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చింది. నితీష్ ముఖ్యమంత్రిగా జేడీయూ, బీజేపీ సంకీర్ణ సర్కారు కొలువుతీరింది.


2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్ లో 60 సీట్లకు 42 సీట్లు సాధించింది. బీజేపీకి 11 దక్కాయి. 2016లో ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా 41 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ కు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచలప్రదేశ్ లో చేరారు. తర్వాత వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.


గోవాలో 2017లో జరిగిన ఎన్నికల్లో 40 సీట్లకు కాంగ్రెస్ 17 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి 13 వచ్చాయి. ఇతర పార్టీలకు చెందిన పదిమంది సభ్యలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 2019లో కాంగ్రెస్ నుంచి మరో 15 మంది బీజేపీలో చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com