వర్షాకాలపు సాయంకాలం వేళ వేడి వేడి బజ్జిలు తింటే ఎట్లుంటది...? ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఇష్టానికి కొంచెం విభిన్నతను జత చేసి, క్యాప్సికం తో బజ్జిలు తింటే ఇంకెలా ఉంటుంది. అద్దిరిపోద్ది కదా!... మరి క్యాప్సికం తో బజ్జిలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా ...
కావాల్సిన పదార్ధాలు: గ్రీన్ క్యాప్సికం - 2 లేదా 3, శనగపిండి - పావు కేజీ, నూనె - అరకేజీ, పసుపు - చిటికెడు, కారం - అరస్పూన్, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీవిధానం:
--- ముందుగా క్యాప్సికం ను నీటితో శుభ్రంగా కడిగి లోపలి విత్తనాలను తీసెయ్యాలి. ఆపై బారుగా ముక్కలు కోసుకోవాలి.
--- ఇప్పుడొక గిన్నెను తీసుకుని అందులో శనగపిండి, ఉప్పుం పసుపు, కారం, ఇంగువ, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. పిండిని జోరుగా కాకుండా, అట్లపిండి మాదిరి థిక్ కన్సిస్టెన్సీ లా కలుపుకోండి.
--- స్టవ్ ఆన్ చేసి, కళాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా కాగనివ్వండి.
--- నూనె వేడెక్కిన తర్వాత, ఒక్కో క్యాప్సికం ముక్కను శనగపిండిలో ముంచి నూనెలో వేసి దోరగా వేయించుకోండి.
--- బంగారు వర్ణం లోకి వచ్చిన వెంటనే నూనెలో నుండి బజ్జిలను తీసివెయ్యండి. లేకపోతే బజ్జిలు మాడిపోయి రుచి పోతుంది.
--- ఈ బజ్జిలకు ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. ఇలానే తింటే చాలా రుచిగా ఉంటుంది.