ప్రపంచంలో ఎన్నో వింతైన ప్రాణులు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. జంతువుల కోసం సినిమాల్లోనూ అలాగే పుస్తకాలలోనూ కొన్ని చూస్తూ ఉంటాం. అయితే ఈ కోవలోనే మరో అరుదైన ప్రాణి 'అలుగు' అనే వింత జీవి లభ్యం కావడంతో అటవీశాఖ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామంలో మంగళవారం రాత్రి వింత జీవి 'అలుగు' స్థానికుల కంటపడింది.
దీనిని జాగ్రత్తగా ఒక వద్ద ఉంచి బుధవారం ఉదయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు టెక్కలి రేంజ్ ఆఫీసర్ పివీ శాస్త్రి, దండు లక్ష్మీపురం సెక్షన్ ఆఫీసర్ ఆర్ వినోద్ కుమార్ గ్రామానికి చేరుకుని ఆ వింతైన జీవిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా స్థానిక పశు వైద్యాధికారి షణ్ముఖ రావును రప్పించి జీవి యొక్క వివరాలు మరియు ఆరోగ్య విషయాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి షణ్ముఖరావు మాట్లాడుతూ ఇది ఎటువంటి హాని చేయని అరుదైన ప్రాణిని దీని ఆహారం చీమలు, చెదపురుగులు మరియు నీటిని మాత్రమే తీసుకుంటుందని కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తూందని తెలిపారు. అనంతరం విశాఖపట్నం కు అటవీశాఖ అధికారులు అలుగును కట్టుదిట్టమైన ఏర్పాట్లతో తరలించారు.