తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో కొలువై ఉన్న ఈ సుబ్రహ్మణ్య ఆలయాన్ని పళని ఆరుల్మిగు శ్రీ దండాయుధపాణి క్షేత్రమనీ అంటారు. ఇడుంబన్ కొండ పైన కార్తికేయుడిగా పూజలందుకుంటున్న సుబ్ర హ్మణ్య స్వామికి కార్తి కమాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. షష్ఠినాడు కావడి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సంబరానికి దేశం నలుమూలల్నుంచీ లక్షలాది భక్తులు హాజరవుతారు. ఈ ఆల యాన్ని ఏడో శతాబ్దంలో కేరళరాజు చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తరవాత పాండ్యులు పునరుద్ధరించారు. భోగార్ అనే ముని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో తయారు చేసిన స్వామి వారి విగ్రహమే గర్భాలయంలో దర్శనమిస్తుంది. గతంలో స్వామివారి తొడ భాగం నుంచి తీసిన విభూతిని కుష్టు రోగులకు పంచేవారు. అలా చేయడం వల్ల విగ్రహం ఆరిగిపోవడంతో ఇప్పుడు విభూతి పంపకాన్ని నిలిపేశారు. స్థలపురాణం... ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందించి తమ కుమారులిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే దాన్ని ఇవ్వమని చెబుతాడు.
దాంతో వారు తమ కుమారులతో ముల్లోకాలనూ చుట్టి రమ్మనీ ఎవరు ముందు వస్తే వారికే ఫలమనీ చెబుతారు. వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనంపై ముల్లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తన సోదరుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లో కాల్ని చుట్టిన ఫలితం పొందాడని తెలుసుకుని నిరాశగా భూలోకంలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉండిపోతాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుని చిన్నబుచ్చుకున్న కార్తికేయుడితో 'కుమారా... సకల జ్ఞానాలకూ నీవే ఫలానివి' అని బుజ్జగిస్తారు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో 'పళం', నీవు అంటే 'నీ' ఈ రెండు కలిపి ఆ ప్రాంతం పళని అయింది. దాంతో భక్తులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఎప్పటికీ ఆ కొండమీదే శాశ్వతంగా కొలువై ఉంటా నంటూ తల్లిదండ్రులను కైలాసానికి వెళ్లి పొమ్మని చెబుతాడు కార్తి కేయుడు. అందుకే అక్కడకు బుద్ధిమాంద్యం ఉన్న చిన్నారులకు ఎక్కువగా తీసుకెళుతుంటారు. కావడి ఉత్సవం విశిష్టత... కుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహా ముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా మారతాడు.
అయితే ఇడుంబన్లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు. 'నాయనా, నేను కైలాసం నుంచి శివగిరి, శక్తి గిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా' అని ఆజ్ఞాపిస్తాడు. ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలు దేరుతాడు ఇడుంబన్. ఆ రాక్షసుడి అసురత్వాన్ని సుబ్రహ్మణ్యుడే పోగొడతాడని శివుడు అందుకు అడ్డు చెప్పడు. అలా కొండల్ని మోసుకుని కొంతదూరం వెళ్లిన ఇడుంబన్ పళని ప్రాంతంలో వాటిని కింద పెట్టి సేదతీరతాడు. కాసేపటికి లేచి కావడి ఎత్తుకుంటే ఒకవైపు బరువుగా, ఇంకోవైపు తేలిగ్గా ఉండటం గమనిస్తాడు. కావడినిదించి చూస్తే బరువున్న కొండ పైన సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పకపకా నవ్వుతూ కనిపిస్తాడు. ఆ చర్యకి కోపమొచ్చిన ఇడుంబన్ స్వామిని వధించాలని కొండ పైకి వెళతాడు. ఆగ్రహిం చిన సుబ్రహ్మణ్యుడు అతడిని సంహరిస్తాడు. విషయం తెలిసిన అగస్త్యముని ఇడుంబన్ ను బతికించమని వేడుకుంటాడు. శిష్యుడి కోరికను మన్నించిన స్కందుడు ఇడుంబనన్ను బతికించి... తన కొండ కిందకొలువై ఉండమనీ, భక్తులు ముందుగా అతడిని దర్శించుకున్నాకనే తన సన్నిధికి రావాలనీ వరమిస్తాడు. ఆలానే షష్ఠినాడు పాలు, విభూతి, పూలు, తేనె, నెయ్యి... వీటిలో ఏదో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకొస్తే తనని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమవుతాడు. అప్పట్నుంచీ పళని కొండకి ఇడుంబన్ అనే పేరు వచ్చింది. స్వామి వారి మెట్ల మార్గం దగ్గర ఇడుంబన్ గుడి ఉంటుంది. భక్తులు ఆ మూర్తిని దర్శించుకున్నాకే వల్లీదేవసేన సమేతుడైన కుమారస్వామి సన్నిధికి వెళతారు. ఈ క్షేత్రం మదురైకి 120 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి మదురైకి విమానంలో వెళ్లి అక్కణ్నుంచీ రోడ్లు లేదా రైలు మార్గంలో వెళ్లేచ్చు. రైల్లో అయితే హైదరాబాద్ నుంచి మదురైగానీ, చెన్నై సెంట్రల్ వరకూగానీ వెళ్లి అక్కణ్నుంచీ చెన్నై సెంట్రల్ -పళని ఎక్స్ ప్రెస్ లో పళని చేరుకో వచ్చు. రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి ఆటో, బస్సుల సౌకర్యం ఉంటుంది.