ఈ మధ‌్య పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగల ముఠాలు ఎక్కువయ్యాయి. తాజాగా ఒడిశాలోకి కొంతమంది దుండగులు... పాఠశాలలోకి చొరబడి కంప్యూటర్లు, ప్రింటర్లు, ఎత్తుకుపోవడమే కాకుండా.. చేతనైతే మమ్మల్ని పట్టుకోండని సవాల్ కూడా విసిరారు. ధూమ్ సినిమా స్టైల్లో బ్లాక్ బోర్డుపై చేతనైతే పట్టుకోండని రాసి పెట్టి వెళ్లారు. ఈ ఘటన నవరంగ్‌పూర్ జిల్లాలోని ఓ స్కూల్లో చోటుచేసుకుంది. కొందరు దుండగులు జూలై 3వ తేదీ ఆదివారం ఒడిశాలోని ఖతీగూడ లో ఉన్న ఇంద్రావతి హై స్కూల్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు.
హెడ్‌మాస్టర్ గదిలో ఉన్న కంప్యూటర్లు, జెరాక్స్ మెషిన్లు, ప్రింటర్లు, ఫొటో కాపీయర్స్, వేయింగ్ మెషిన్లు, సౌండ్ బాక్స్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా మీకు చేతనైతే తమను పట్టుకోండంటూ కొన్ని ఫోన్ నెంబర్లను ఓ తరగతి గదిలోని బ్లాక్ బోర్డుపై రాశారు. దాంతోపాటు ధూమ్ 4 తొందర్లో వస్తుందని రాసి వెళ్లారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు.. ప్యూన్ పాఠశాలకు వెళ్లాడు. అయితే హెడ్ మాస్టర్ గదిలో తలుపు పగలగొట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న సామగ్రి కనిపించకపోవడంతో ఆ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశాడు.
పాఠశాల అధికారులు దొంగలు పడ్డారని నిర్ధారించుకుని.. పోలీసులకు సమాచారం అందజేశారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు సర్బేశ్వర్ బెహెరా ఖతీగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు గురించి ఆధారాలు సేకరించేందుకు సైంటిఫిక్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌తో పాటు పోలీసు బృందం పాఠశాలను సందర్శించింది. ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.