ఆరు అంచెల విద్యావిధానంతో ఏపీలో మంగళవారంనాడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత విద్యార్థులతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. మరోవైపు, ఈ ఏడాది నుంచి నూతన విద్యావిధానం అమలు కాబోతోంది. గతంలో మాదిరి కాకుండా ఆరు అంచెల విద్యావిధానంతో విద్యా సంవత్సరం కొనసాగనుంది. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్ ప్లస్ గా పాఠశాలలు ఉండనున్నాయి. పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లతో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలావుంటే పాఠశాలలు తెరుచుకోనున్న ఈరోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లలో మూడు జతల యూనిఫాం, బెల్టు, బూట్లు, సాక్సులు, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలను అందించనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ హైస్కూల్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఇప్పటికే అన్ని పాఠశాలల ప్రాంగణాలు, గదులను అధ్యాపకులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.