కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇపుడు అందర్నీ ఆకట్టుకొంటోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్లను జగన్ అందించారు. జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారాలు (క్లాత్), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఉంటాయి. ఇంకా బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటున్న సంగతి తెలిసిందే. అన్నింటినీ బ్యాగులో పెట్టి, పిల్లలకు అందిస్తారు. మంగళవారం ఈ కిట్ల పంపిణీని ప్రారంభించిన సీఎం పిల్లలకు ఇచ్చే ఓ బ్యాగును భుజానికేసుకుని ఫొటోలకు పోజిచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు పలు వ్యాపారాలు కలిగిన బుట్టా రేణుక... 2014 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కర్నూలు ఎంపీ టికెట్‌ను సాధించారు. ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ విపక్షానికి పరిమితం కావడంతో రేణుక టీడీపీలో చేరిపోయారు.