వైఎస్ రాజశేఖరరెడ్డి మహాభినిష్క్రమణం నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నా అంటూ సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ ప్రారంభోపన్యాసాన్ని ఆరంభించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడానికి.. అందరి ఆత్మాభిమానం కోసం ఆవిర్భవించిన పార్టీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రజలకు చేస్తున్న మంచిని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి శ్రేణుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. అధికారమంటే ప్రజల మీద మమకారం చూపించడమేనని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నామని శ్రేణులకు గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేయడం ద్వారా పరిపాలనలో.. ప్రజల జీవన ప్రమాణాల్లో.. సామాజిక, విద్య, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని.. మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయడమంటే ఇలా అని నిరూపించామని సీఎం వివరించారు. ప్రజలకు మేలు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం, దత్తపుత్రుడితో జాయింట్‌గా ఏర్పడిన గజ దొంగల ముఠా అంటూ ఎండగట్టారు. ప్రజల ఇంట ఉన్న మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టే రాక్షస గణాలన్నీ ఒక్కటవుతున్నాయన్న పదునైన విమర్శలు చేసారు. గజదొంగల ముఠా దాష్టీకాలపై మనమంతా ఆలోచన చేసి.. ప్రజలకు ఆలోచన కలుగజేసేలా చేసేందుకు ప్లీనరీలో తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పారు.