ప్రజలపై మోయలేని భారం వేస్తూ వసూలు చేస్తున్న పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. నవరత్న పథకాల అమలుపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన నవ సందేహాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో కృష్ణా, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులతో నాగబాబు సమావేశం అయ్యారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరును, ప్రజా ధనాన్ని దోచుకుంటున్న విధానాన్ని పార్టీ శ్రేణులు నాగబాబు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వైసీపీ నాయకత్వం ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి ప్రజలను తప్పుదోవ పట్టించారని, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలిసి ఇప్పుడూ రకరకాల సాకులతో సాధారణ ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని చెప్పారు. జనసేన సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రభుత్వ పథకాలు పాలకుల సంపాదన మార్గాలుగా మారకుండా ప్రతీ పేద కుటుంబానికి చేరాలి అనేది జనసేన లక్ష్యం అని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రతీ పేద కుటుంబానికి పది లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ సహాయం అందజేసే బృహత్తర ప్రణాళిక జనసేన దగ్గర ఉన్నదని తెలిపారు. జనసేన పరిపాలనలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బాధ్యతాయుతమైన వ్యవస్థ పని చేస్తుందని స్పష్టం చేశారు.