దోమలు కుడితే మలేరియా వస్తుంది. కానీ అదే దోమ ప్రస్తుతం కుడితే మలేరియాతో పాటు కరోనా వైరస్ కూడా సోకే ప్రమాదముందని శాస్త్రవేతల అధ్యయనంలో తేలింది. వైరస్.. అది పూర్తి స్థాయిలో జీవమూ కాదు, అలాగని బతికిలేదని చెప్పలేని ఓ కణం. అత్యంత సూక్ష్మంగా ఉన్నా.. భూమిపై అన్ని రకాల జీవజాలాన్నీ సతాయించే శక్తి వాటి సొంతం. అసలే కరోనా వైరస్ మానవాళిని వణికిస్తోంది. ఇలాంటి సమయంలో వైరస్ లకు ఉన్న మరో శక్తి తాజా పరిశోధనలో బయటపడింది. వైరస్ లు మనుషుల నుంచి వెలువడే వాసనలను మార్చేస్తాయని.. ఆ వాసనలు దోమలను బాగా ఆకర్షిస్తాయని తేలింది. ఇలా దోమలను ఆకర్షించి, అవి మనల్ని కుట్టడం ద్వారా.. మరింతగా వ్యాపించేందుకు వైరస్ లు మార్గం వేసుకుంటున్నట్టు వెల్లడైంది.
అమెరికాకు చెందిన కనెక్టికట్ యూనివర్సిటీ, చైనాలోని బీజింగ్ సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అంశంపై పరిశోధన చేశారు. దోమల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి జ్వరాలతో ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. కోట్లాది మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధులు వ్యాపించడానికి ప్రధాన కారణం దోమలు. ఒక రోగిని కుట్టిన దోమలు.. మరికొందరిని కుడుతూ వెళ్లడం వల్ల అందరికీ ఆ వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ క్రమంలో అప్పటికే వ్యాధి సోకినవారిని దోమలు ఎక్కువగా కుడుతుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేమిటో తేల్చే దిశగా పరిశోధన చేసి.. అసలు వైరస్ లే మన శరీర వాసనలను మార్చేస్తున్నట్టు తేల్చారు.
వైరస్ సోకినవారి చర్మం నుంచి అసిటోఫెనోన్ అనే ఒక వాసన వస్తోందని.. దానికి దోమలు ఆకర్షితం అవుతున్నట్టు గుర్తించామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కనెక్టికట్ వర్సిటీ ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంగ్వా వాంగ్ తెలిపారు. బాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఈ అసిటోఫెనోన్ తయారీలో కీలకమని.. డెంగ్యూ, జికా వైరస్ లు బాసిల్లస్ బ్యాక్టీరియాపై ప్రభావం చూపి అసిటోఫెనోన్ ను పెంచుతున్నాయని చెప్పారు. దీని పరిష్కారానికి సంబంధించి ఎలుకలపై ప్రయోగం చేశామని, వాటికి విటమిన్ 'ఏ'ను ఇచ్చి, బాసిల్లస్ బ్యాక్టీరియాను తగ్గించేలా చేస్తే.. దోమలు ఆకర్షితం కావడం తగ్గిందని పెంగ్వా వాంగ్ వెల్లడించారు. మనుషులపైనా ఇలాంటి ప్రయోగం చేస్తే.. దోమల బారి నుంచి, వాటితో సోకే రోగాల నుంచి మానవాళిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.