జపాన్ మాజీ ప్రధాని షింజో అబెను తాను ఎందుకు హత్యచేశానో వెల్లడించాడు నిందితుడు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గన్ కల్చర్‌కు చాలా దూరమైన, అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా పేరొందిన జపాన్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నివ్వెరపరిచింది. జపాన్ పార్లమెంట్ ఎగువ సభకు ఎన్నికలు జరగనున్న వేళ.. నరా నగరంలో ఓ కూడలిలో ప్రసంగిస్తున్న షింజో అబెపై 41 ఏళ్ల తెత్సుయ యమగామిఅతి సమీపంగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని వేదికపైనే కుప్పకూలారు. దేశీయ తుపాకీతో షింజో అబెపై రెండుసార్లు కాల్పులు జరిపిన యమగామి.. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. భద్రతా దళాలు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాయి. పోలీసుల విచారణలో అతడు కీలక వివరాలు తెలిపినట్లు సమాచారం.
నిందితుడు యమగామి గతంలో మూడేళ్ల పాటు జపాన్ నౌకాదళంలో పనిచేశాడు. జపాన్ మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో 2005 వరకు విధులు నిర్వహించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ తయారీ సంస్థలో పనిచేశాడు. రెండు నెలల కిందట ఆ ఉద్యోగం కూడా మానేశాడు. అందుకు అలసిపోయాననే కారణం చెప్పాడు. షింజో అబెపై తనకు రాజకీయేతర అంశాల్లో అసంతృప్తి ఉందని.. అందుకే ఆయణ్ని చంపానని పోలీసుల వద్ద నిందితుడు పేర్కొన్నట్లు జపాన్ మీడియా ఏజెన్సీ క్యోడో న్యూస్ పేర్కొంది. అయితే, ఈ హత్య విషయంలో అతడి ఆలోచన వేరుగా ఉందని సదరు మీడియా కథనంలో పేర్కొన్నారు.
ఒక మత సంస్థకు చెందిన గురువును హత్య చేయాలని యమగామి తొలుత భావించాడట. ఆ మత గురువు తన తల్లిని మోసం చేశాడని.. అందుకే అతడిపై కోపం పెంచుకున్నానని నిందితుడు పోలీసులతో చెప్పినట్లు క్యోడో న్యూస్ ఏజెన్సీ రాసుకొచ్చింది. అయితే, జపాన్ మాజీ ప్రధాని షింజో అబె.. దేశంలో సదరు మత గ్రూపును ప్రోత్సహించారని యమగామి నమ్మాడు. ఈ అనుమానంతోనే షింజో అబెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారని క్యోడో న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ కథనం ప్రకారం.. అబెను హత్య చేయాలనే ప్లాన్‌తో ఆయన పాల్గొన్న పలు ఎన్నికల ర్యాలీల వద్దకు యమగామి వెళ్లాడు. చివరికి నరా పట్టణంలో తన ప్రణాళిక అమలు పరిచాడు. అయితే.. ఆ మత గురువు ఎవరో మాత్రం క్యోడో న్యూస్ ఏజెన్సీ వెల్లడించలేదు. యమగామి మానసిక స్థితి కూడా స్థిరంగా లేనట్లు తెలుస్తోంది. హైస్కూల్ విద్య తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై అతడికి స్పష్టత లేదని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ఇయర్ బుక్‌లో అతడు అదే విషయాన్ని రాసినట్లు తెలిపారు.
నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న కాసేపటికే దర్యాప్తు బృందానికి చెందిన కొంత మంది అధికారులు.. నరాలోని అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. కొన్ని పేలుడు పదార్థాలు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. షింజో అబె దారుణ హత్యతో జపాన్ మూగబోయింది. తమ అభిమాన నేతను తలచుకొని ఆ దేశ పౌరులు కంటతడి పెడుతున్నారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం (జులై 9) ఉదయం రాజధాని టోక్యోకు తరలించారు. షింజో అమెను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.