వైద్యానికే కాదు కనీసం చదవుకొందామనుకొన్నా చాలా గ్రామాల పిల్లలకు రోడ్డుమార్గంలేదు. అలాంటిదే ఒడిశాలోని ఓ గ్రామ విద్యార్థుల పరిస్థితి. పిల్లలు చదువుకోవాలంటే.. పుస్తకాలు ఉండాలి. ఫీజులు కట్టాలి. చాలామందికి ఇవే తెలుసు. కానీ మన దేశంలో చాలా గ్రామాల్లో విద్యార్థులు చదువుకోవాలంటే పెద్ద పెద్ద సాహసాలు కూడా చేయాలి. సరైన బస్సు సర్వీసులు లేక, రోడ్లు లేక, వంతెనలు లేక.. కొన్ని గ్రామాల్లో పిల్లలు విద్య కోసం వేలాది కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఇప్పటికి ఉంది. అడవులు, చెరువులు దాటి ప్రయాణాలు చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏటికి ఎదరీదాలి. ప్రాణాలను పణంగా పట్టాలి. ఒడిశాలోని గంజాం జిల్లాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఏర్పడింది.
పత్రాపూర్ బ్లాక్‌లో వంతెన లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జ్ లేకపోవడంతో నదిలో నుంచే ప్రయాణిస్తూ తమ పాఠశాలలకు చేరుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహ ధాటికి నదిలో కాలు పెట్టడానికి కూడా అవకాశం లేకపోయింది. దాంతో ఇటు, అటు ఓ తాడును కట్టి దాని సాయంతో నెమ్మదిగా నదిని దాటుతూ తమ విద్యాసంస్థలకు చేరుకుంటున్నారు. గ్రామస్థుల సహాకారంతో గత శుక్రవారం పిల్లలు ఇలా నదిని దాటుతున్నారు.
"జిల్లాలో భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహంలో పిల్లలు నదిని దాటడం కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో నదికి ఒక చివర నుంచి మరో చివర వరకు తాడు కట్టి పిల్లలను నది దాటేలా చేశాం. ఆ తర్వాత పిల్లలు క్షేమంగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, ఈ పరిస్థితి ప్రమాదకరం." అని స్థానిక నివాసి రవీంద్ర నాయక్ అన్నారు. ఇది ఏ ఒక్క ఊరు సమస్యో కాదు.. 15 గ్రామాల ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ నదిని దాటవలసి ఉంటుంది. గతంలో చాలాసార్లు ఇక్కడ వంతెన నిర్మించాలని అధికారులను కోరారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దాంతో ఆ సమస్య ఇప్పటి వరకు తీరలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ కష్టాలను తీర్చాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అయితే ఈ నది సమస్య గురించి ఒడిశా విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్‌కు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులను ఆదేశించారు. "ఈ ఘటన గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం నాకు మీడియా ద్వారా తెలిసింది. సమస్యను పరిష్కరించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక అధికారులను ఆదేశించాను." అని దాస్ తెలిపారు.