తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.ఏపీలో సీఎం జగన్, తెలంగాణలో మంత్రి కేటీఆర్ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం తర్వాత సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో తీస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రంలో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. వైకాపా తరఫున మంత్రి బుగ్గన, శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 175మంది ఎమ్మెల్యేలు పోలింగ్‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు.. తమ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. వైకాపా, తెదేపాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు వేయనున్నారు.