భారీ ఇన్నింగ్స్ ఆడి గెలిస్తే ఆ కిక్కే వేరుగా ఉండేదని టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో రిషబ్ పంత్ (113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 నాటౌట్) అజేయ శతకంతో రాణించడంతో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 10 ఫోర్లతో 71) ఆదుకున్నారు. ఇన్నింగ్స్ ముగిసే వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం పంత్ తన ఇన్నింగ్స్‌తో ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ సెంచరీని జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పాడు. ఇంగ్లండ్‌లో ఆడటం తనకు ఎప్పుడూ వినోదమేనని అన్నాడు. ఈ సిరీస్ విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఉందని అన్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఎందుకంటే వన్డే ఫార్మాట్‌లో ఇది నా తొలి సెంచరీ, అది కూడా జట్టు ఇలాగే ఇన్నింగ్స్ ఆడి గెలవాలని కష్టపడుతున్నప్పుడు.. ఆ కిక్కే వేరు అన్నాడు.