యశ్వంత్ సిన్హా కుమారుడు ఎంపీ అయిన జయంత్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారు అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సోమవారం జరిగిన పోలింగ్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. రాష్ట్రపతి బరిలో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ... ద్రౌపది ముర్ము విజయం కోసం వ్యూహం రచించింది. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎంపీ హోదాలో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయంత్ ఓటు వేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కనిపించింది. ఈ ఫొటోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా జరుగుతోంది. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ బీజేపీ... ముర్ముకు ఓటేయమని జయంత్‌కు చెప్పింది. అయితే తన తండ్రి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో అసలు జయంత్ ఎవరికి ఓటు వేశారన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.