బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నుపుర్ శర్మకు ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లైంది. నుపుర్ శర్మపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నుపుర్ శర్మకు ప్రాణ హాని ఉందంటూ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సోమవారం నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనకు పలు వర్గాల నుంచి ప్రాణ హాని ఉందని కూడా ఆమె కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా మార్చాలని కూడా ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు నుపుర్ శర్మకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.