బ్రిటన్ ప్రధాని పీఠానికి భారత సంతతికి చెందిన వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ మరొక్క అడుగు దూరంలో ఉన్నారు. అధికార కంజర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యేందుకు బుధవారం జరిగిన ఐదో (తుది) రౌండ్‌లోనూ భారీ మెజార్టీతో విజయం సాధించారు. రిషి సునక్‌కు 137 మంది కంజర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓటేయగా, సమీప పోటీదారు, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు 113 ఓట్లు వచ్చాయి. ఇక 105 ఓట్లు మాత్రమే పొందిన వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో కంజర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికవడం.. తద్వారా ప్రధాని పీఠంపై కూర్చొనేందుకు రిషి సునక్‌తో పాటు లిజ్ ట్రస్ మాత్రమే బరిలో ఉన్నారు. మొదటి నుంచి చివరి రౌండ్ వరకు రిషి సునక్ పోటీలో అగ్రస్థానంలో నిలువడం గమనార్హం.
తుది బరిలో నిలిచిన రిషి సునక్, లిజ్ ట్రస్ ఎన్నికల ప్రక్రియ చివరి దశలో భాగంగా కంజర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు కోసం కొన్ని వారాల పాటు ప్రచారం చేపట్టనున్నారు. వచ్చే సోమవారం బీబీసీలో వీరిద్దరి మధ్య తొలి లైవ్ టెలివిజన్ డిబేట్ జరిగే అవకాశం ఉన్నది. పార్టీ సభ్యులు వీరిద్దరిలో ఒకరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటేస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారే ప్రధాని అవుతారు.