బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటువేసిన వారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆయన కృతజ్ఞతలు తెలిపింది ఎవరికో తెలుసా...?రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేసిన విపక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ధన్యవాదాలు చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేశారని అంచనా. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు, 104 మంది ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ద్రౌపది ముర్ము గెలుపు సంబరాల్లో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ వీడియోను విడుదల చేశారు. ‘తమ మనస్సాక్షి మాటను విని, ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా గెలిపించాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గిరిజన సమాజానికి చెందిన సోదరి అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ నామినేట్ చేసింది. ఆమె ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాజ్యాంగ పదవికి ఎన్నికైంది. ఇది అందరూ గర్వించదగిన క్షణం’ అని చౌహాన్ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం పుట్టి.. రాష్ట్రపతి హోదాకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలిగా ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. జులై 25వ తేదీన ఆమె రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.