ఇటీవల వయో వృద్ధులకు ఇస్తున్న రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వయో వృద్ధులకు అందజేస్తున్న రాయితీలను పునరుద్ధరించే దిశగా భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు బుధవారం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రైళ్లలో వృద్ధులకు అందిస్తున్న రాయితీలను పునరుద్ధరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో అమలు చేసిన రాయితీలకు కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు రాయితీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పునరుద్ధరించనున్న రాయితీ 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధులకు మాత్రమే అందనుంది. గతంలో ఈ వయో పరిమితి 58 ఏళ్లుగా ఉండేది. అంతేకాకుండా త్వరలోనే అందుబాటులోకి రానున్న రాయితీ ప్రయాణం జనరల్, స్లీపర్ క్లాసుల్లో మాత్రమే వర్తించనుంది.