ఈడీ అధికారాలపై దేశ అత్యున్నత్త న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మనీ లాండరింగ్ చట్టం కింద నమోదు చేసే కేసుల్లో అరెస్టు, సమన్లు జారీ చేయడం, ఆస్తులు జప్తు చేసే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఉంటుందని సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అరెస్ట్‌కు సంబంధించిన విషయాలను ఈడీ అధికారులు వెల్లడించడం తప్పనిసరి కాదని పేర్కొంది. ఈ మేరకు పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.
పీఎంఎల్‌ఏలోని పలు సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విభాగాలు పోలీసు విభాగాలు కాదని.. విచారణలో ఆయా సంస్థలు నమోదు చేసే వాంగ్మూలాలే సాక్ష్యంగా పరిగణించొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు కాపీని ప్రతిసారీ నిందితులకు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. నిందితులను అరెస్ట్ చేసే సమయంలో ఫిర్యాదు వివరాలను చెబితే సరిపోతుందని సుప్రీం కోర్టు తెలిపింది.
మనీలాండరింగ్ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం బెయిల్ పొందడం కఠినంగా మారినట్లు పిటిషనర్లు పేర్కొనడాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. బెయిల్ కోసం జంట నిబంధనలు చట్టబద్ధమేనని, ఏకపక్షం కాదని పేర్కొంది. ముందస్తుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం కూడా ఈడీ విచారణకు అడ్డంకి కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్లు 5, 8(4), 15, 17, 19లు చట్టబద్ధమేనని.. బెయిల్ విషయంలోనూ సెక్షన్ 45 సరైనదేనని ధర్మాసనం పేర్కొంది.