కర్ణాటక సర్కార్ కూడా త్వరలో బుల్డోజర్ల విధానం అమలులోనికి తీసురానున్నదా...? ఆ రాష్ట్ర సీఎం వ్యాఖ్యల మర్మమేమిటీ అన్నది ఇపుడు తీవ్ర చర్చాంశనీయంగా మారింది. కర్ణాటకలో ఓ బీజేపీ కార్యకర్త హత్య విషయంపై పార్టీలోను, బయటా నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని.. ఒకవేళ పరిస్థితులుగానీ మారితే కర్ణాటకలో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న దేశ వ్యతిరేక, మతతత్వ శక్తులను నియంత్రించేందుకు ‘యోగి మోడల్’ పాలన అమలు చేస్తామని హెచ్చరించారు.
ఇటీవల దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువజన విభాగం నేత ప్రవీణ్ నెట్టార్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, హిందూత్వ వాదుల ప్రాణాలు కాపాడుకొనేందుకు కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ, సంఘ్ పరివార్ నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేవై నేత ప్రవీణ్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్నామని.. దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బొమ్మై నేతృత్వంలోని కర్ణాటక బీజేపీ ప్రభుత్వం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ లో మత కల్లోలాలు, దాడుల విషయంగా యోగి ఆదిత్యనాథ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆస్తుల ధ్వంసానికి దిగిన వారి నుంచి నష్ట పరిహారం వసూలు చేయడం నుంచి దోషులకు చెందిన అక్రమ ఆస్తులు, నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేయడం దాకా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఇది వివాదాస్పదంగా మారినా కూడా.. కర్ణాటకలోనూ అలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బొమ్మై వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.