లోక కళ్యాణం కోసం, దేశాభివృద్ధి జరగాలనే సంకల్పంతో పరమహంస పరివ్రాజకులు, త్రిదండి చిన్న జీయర్ స్వామి సంకల్పించిన శ్రీ లక్ష్మి యాగం దేశంలోని అన్ని జీయర్ స్వామి సంస్థల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి సూచనలమేరకు విశాఖపట్నంలోని విశాఖ- భీమిలి బీచ్ రోడ్ లో గల వారిజ వేదపాఠశాల లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న చిన్న జీయర్ స్వామి వారి శిష్యులు పరమహంస పరివ్రాజకులు త్రిదండి దేవనాధా రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోశనివారం అగ్ని ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
వేదంలో చెప్పిన విధానంగా అగ్ని కోసం ఆరణి మథనం ( కర్ర చెక్కల రాపిడితో వచ్చే నిప్పు) తో అగ్ని ని రప్పించి దాన్ని యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి, హోమ కుండంలో జ్వాలా వెలిగించారు. ఈ సందర్భంగా దేవనాథ జీయర్ స్వామి మాట్లాడుతూ యజ్ఞ యాగాదులు నిర్వహించేటప్పుడు యువాగ్ని, వృద్ధగ్ని, లేదా బాలాగ్ని మాత్రమే వినియోగించాలని, కర్పూరం తో అగ్నిని వెలిగించరాదన్నారు. ఇది సంప్రదాయ విరుద్ధం అన్నారు.
వేదం ప్రమాణం ప్రకారం హోమకుండంలో అగ్ని వెలిగిచేందుకు కేవలం కర్ర ల రాపిడితో వచ్చే నిప్పు రావాలనే వినియోగించడం జరుగుతుందన్నారు. ఇటీవల భాగ్యనగరం లో చిన్న జీయర్ స్వామి వారు నిర్వహించిన రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో 1035 హోమకుండల్లో అగ్ని సైతం ఇలాంటి అరణి మధనం ద్వారానే వినియోగించడం జరిగిందన్నారు. విశాఖ లోని వారిజలో శనివారం అరణి మధనం లో కేవలం రెండు నిమిషాల్లోనే జ్వాలా రావడం గమనార్హం. ఈ కార్యక్రమాలను వారిజ వేదపాఠశాల వేదపండితులు ముడుంబై శ్రీకాంత్ స్వామి, సంతోష్ కుమార్ స్వామిలు పర్యవేక్షిస్తున్నారు.
దేశ అభివృద్ధి కోసం, లోక కళ్యాణం కోసం మూల మంత్రం హవనం, శ్రీ సూక్త హోమం, భక్తుల విద్య, వ్యాపార, తదితర రంగాల్లో అభ్యున్నతి కోసం నక్షత్ర హోమాలను, వారిజ ఆశ్రమం వేదం పండితులచే నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. ఈ యాగ కార్యక్రమాలను దేవనాథ జీయర్ స్వామి వివరించారు. సనాతన హైందవ సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రత్యేకించి శ్రావణ మాసం లో అమ్మవారి అనుగ్రహం కోసం ఆరాధన చెయ్యడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
ఈ శుభ సందర్బంలో 27 రోజుల పాటు వారిజ వేదిక గా శ్రీ సూక్త, మూలమంత్ర హవనం, నక్షత్ర హోమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 29 న అంకురారోపణ, మృత్సంగ్రహణ జరుగుతుందని, 30 వ తేదీ ఉదయం అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం వైదిక పరంగా సాగుతుందన్నారు. శ్రీ యాగంలో భాగంగా ప్రతి రోజూ హోమ కార్యక్రమం జరుగుతుందని, మూలమంత్రం, ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికీ అభివృద్ధి కలగాలని నక్షత్ర శాంతి హోమం, శ్రీ సూక్త హోమం, నిత్యా పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందన్నారు.